శోధింపుము

font help
best viewed in IE and firefox
యాదృచ్చిక పదము: నెగ్గు

తెలుగుబిడ్డ నీవు తెలుగుగడ్డ నీది!
తెలతెలవారే వచ్చే వెలుగంటి భాష నీది!

చిలకపలుకు చందాన పనికిరానిచదువులేల?
మేధను పెంపొందింపక కాగితాలు నింపనేల?
మన భాషపై వైముఖ్యం పరభాషపై మోహమిది.
ఆదిలోనే తుంచివేసె ఆలోచనా శక్తినిది!

అమ్మకైన కమ్మగా కమ్మ రాయునేర్పు ఏది?
విశ్వాన్నబ్బురపరిచే వైజ్ఞానిక ఘనత ఏది?
రెంటికి చెడ్డ రేవడిమైనామని తెలుసుకో!
దీపం ఉన్నది ఇపుడే ఇల్లు చక్కదిద్దుకో!

మందాకిని (లక్ష్మీదేవి)


అంతర్జాలంలో సమకాలీన అంశాలతో పరిపూర్ణ తెలుగు నిఘంటువు ఒకటి వుంటే బాగుంటుందని ఒక ఆశా కిరణం మనసులో మెదిలిన రోజు. ఆ ఆశా జ్యోతి నుంచి నలు దిశలా కిరణాలు వ్యాపించి ఈ మహాత్కార్యానికి సమిధలయ్యే సభ్యగణంకోసం ఒక సమూహాన్ని ఏర్పరిచిన రోజు. ఆ సరస్వతీమ తల్లి కాంతికు ఆకర్షితులై గుమిగూడిన సభ్యగణం. వెరసి తెలుగు నిఘంటువేదిక జననం.

ఒంటరి ప్రయాణమా? జతగా పయనమా? లేదా గుంపులు గుంపులుగా కలిసి పయనమా? ఏ మజిలీలో ఎవరు అలసి పోతారో ! కలిసి నడిచే బాటసారులెంతమంది? దారిలో ఎన్ని అడ్డంకులెదుర్కోవాలో?. ఇవన్నీ మా సమూహ సభ్యుల పట్టి పీడించిన కొన్ని ప్రశ్నలు మాత్రమే.

గమ్యమేమిటో తెలుసు, అది సుదూరమనీ తెలుసు. రహదారి లేదనీ తెలుసు.

ఒకరికొకరు జతకూడి
ఓరిమితో చేయి కలిపి
పట్టిన పిడికిలి బిగించి
అడ్డుపడే రాలురప్పల
పెకలించి....

సుదూర గమ్యాన్ని
ఆ సుందర స్వప్నాన్ని
మనసున విత్తుకొని
భావితరానికి భవిష్య
బీజాక్షర సంపదనందించగ

కదం తొక్కిన వాణీ ప్రియ పుత్రులార
కలిసి సాగిన ఉక్కు మనుషులార
అదుగో శిఖరం
తెలుగు సాహితీ సారస్వత గిరి శిఖరం
అదుగో మన గమ్యం
నవ్యాంధ్ర బాలల సుందరలోకం

ఈ ఆశాకిరణం నిశీధిలో కలిసి కనుమరుగవక ముందే మొదలైన మొదటి మెట్టు "శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు" ను యూనికోడ్ లోకి మార్చటం. ఈ కార్యానికి ఆర్ధిక పరంగానూ, నిఘంటువును డిజిటలైజ్ చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి ఒక్కో ఇటుకను పేరుస్తూ ఈ ఆరు నెలల కాలంలో మాతో సహ ప్రయాణం చేసిన, చేస్తున్న మా సభ్యగణ వివరాల కోసం "మాగురించి" పుట లో చూడవచ్చు.

మరి వేచి చూడక స్వాగతం పలుకుదామా

  భాస్కర రామిరెడ్డి [ తెలుగు నిఘంటు సమూహము తరుపున ]

తెలుగు నిఘంటువు